వర్షంలోనూ పోలింగ్ సిబ్బంది తరలింపు
సాక్షి, పాడేరు: జిల్లాలో గురువారం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్‌బర్ధర్, జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్ పర్యవేక్షణలో బుధవారం ఉదయం నుంచే అన్ని మండలాల్లో ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు, సిబ్బంది మండల కేంద్రాల్లోని రిసెప్షన్ కేంద్రాలకు చేరుకున్నారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సామగ్రి, బ్యాలెట్ బాక్సులను స్వీకరించారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. పాడేరు డిగ్రీ కళాశాల రిసెప్షన్ కేంద్రంలో సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్‌బర్దర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి భానుమూర్తిరాజు పర్యవేక్షించారు. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూ రు, గూడెంకొత్తవీధి మండలాల్లోనూ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
● జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 617 పోలింగ్ కేంద్రాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీటిలో 44 మారుమూల, సమస్యాత్మక కేంద్రాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మిగిలిన కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
● ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, ఎస్పీ తెలిపారు. వెబ్‌కాస్టింగ్‌తోపాటు అవసరమైన కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేపట్టనున్నారు. సున్నితమైన కేంద్రాల్లో 78 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సిబ్బంది, సామగ్రి తరలింపునకు 103 ఆర్టీసీ బస్సులు, 276 జీపులు, వ్యాన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3,702 మంది ఎన్నికల సిబ్బంది, 78 మంది జోనల్ అధికారులు, 117 మంది రూట్ అధికారులను నియమించారు.
సెగ్మెంట్ల వారీగా ఓటర్ల సమాచారం
అనంతగిరి మండలంలో 14 సెగ్మెంట్ల పరిధిలో 38,286 మంది ఓటర్లు, అరకులోయ మండలంలో 16 పరిధిలో 42,725 మంది, చింతపల్లి మండలంలో 20 పరిధిలో 65,374 మంది ఓటర్లు ఉన్నారు. డుంబ్రిగుడ మండలంలో 14 పరిధిలో 38,743 మంది, జి.మాడుగుల మండలంలో 16 పరిధిలో 44,674 మంది, గూడెంకొత్తవీధి మండలం 18 పరిధిలో 52,412 మంది ఓటర్లు ఉన్నారు. హుకుంపేట మండలంలో 15 సెగ్మెంట్ల పరిధిలో 45,787 మంది, కొయ్యూరు మండలంలో 14 పరిధిలో 43,711 మంది, ముంచంగిపుట్టులో 14 పరిధిలో 38,895, పాడేరు మండలం 17 పరిధిలో 44,536 మంది, పెదబయలు మండలం 15 సెగ్మెంట్ల పరిధిలో 43,322 మంది ఓటర్లు ఉన్నారు.
11 జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 70మంది
జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు 70మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 11మంది, టీడీపీ 6, బీజేపీ, ఆమ్‌ఆద్మీ4, బీఎస్పీ 1, సీపీఎం 4,కాంగ్రెస్ 8, జనసేన నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. జిల్లాలోని 172 ఎంపీటీసీ స్థానాలకు 648 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
కాలువల ఉధృతి.. ఓటుకు ఆటంకం?
మన్యంలో వర్షాల ఎఫెక్ట్!
617 కేంద్రాల్లో పోలింగ్
4.98 లక్షల మంది ఓటర్లు
44 కేంద్రాల్లో 3 గంటలకే ముగింపు
3,702 మంది ఎన్నికల సిబ్బంది
103 ఆర్టీసీ బస్సులు.. 276 వాహనాలు
78 మంది మైక్రో అబ్జర్వర్లు
కొయ్యూరు: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు.. వెరసి మండలంలోని యూ.చీడిపాలెం సెగ్మెంట్‌లో పోలింగ్‌పై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. ఈ సెగ్మెంట్ పరిధిలోని ఎం.భీమవరం, యూ.చీడిపాలెం పంచాయతీల్లో 48 గ్రామాలు ఉండగా.. వాటిలో 20కి పైగా గ్రామాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలంటే రెండు, మూడు కాలువలు దాటాల్సి ఉంది. వర్షాలతో కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఓటర్లు కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా మారింది.
ఎం.భీమవరం పంచాయతీలోని మందపల్లి గ్రామం పోలింగ్ కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి రావాలంటే రెండు పెద్ద కాలువలు దాటాల్సి ఉంటుంది. మర్రిపాకలు, గంగవరం, నీలవరం, తీగలమెట్ట, బిల్లుపాలెం, రేవులకోట, పుట్టకోట, పీఎల్ కొత్తూరు తదితర గ్రామాల ప్రజలకూ ఇదే పరిస్థితి. కాలువల ఉద్ధృతి తగ్గితేనే వీరు ఓటు వేసేందుకు వచ్చే అవకాశం ఉంది.
వర్షాలు తగ్గితేనే.. దీనిపై ఆర్‌ఓ నరసింహారావును సంప్రదించగా.. వర్షాలు తగ్గుతాయని భావిస్తున్నామని తెలిపారు. కాలువల ప్రవాహం తగ్గితే మారుమూల గ్రామాల నుంచి ఎక్కువ మంది ఓటు వేసేందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. యూ.చీడిపాలెం సెగ్మెంట్‌లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెప్పారు.


