ఎంపీపీలు, జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీదే | - | Sakshi
Sakshi News home page

ఎంపీపీలు, జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీదే

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

జిల్లాలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో విజయం ఖాయం

పార్టీ బీ–ఫారం పొందిన వారే అధికారిక అభ్యర్థులు

పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

పాడేరు: ఈ నెల 5న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందని, జిల్లాలో ఎంపీపీ స్థానాలతో పాటు జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకుంటామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పాడేరులోని తన నివాసంలో అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున బీ–ఫారాలు పొందిన వారే పార్టీ అధికారిక అభ్యర్థులని స్పష్టం చేశారు. టికెట్లు దక్కని కొందరు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసి పోటీలో కొనసాగుతున్నారని తెలిపారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్నది వైఎస్సార్‌సీపీ కాలమేనని, కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, శోభా హైమవతి, పాడేరు నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement