పొత్తు కాగితాలకేనా! | - | Sakshi
Sakshi News home page

పొత్తు కాగితాలకేనా!

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

● పెదబయలు ‘కూటమి’లో ఎవరికి వారే..! ● సీట్ల సర్దుబాటుతో మొదలైన విభేదాలు ● టీడీపీ, జనసేన ర్యాలీకి బీజేపీ దూరం

పెదబయలు: పైకి పొత్తు.. క్షేత్రస్థాయిలో ఎవరికి వారే అన్నట్లుగా పెదబయలు మండలంలో కూటమి పార్టీల పరిస్థితి తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సీట్ల పంపకాలతో మొదలైన విభేదాలు ఇంకా సమసిపోలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా మూడు పార్టీల మధ్య సర్దుబాటు కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు వేర్వేరుగా బరిలో నిలిచారు. గ్రామస్థాయిలో ఎవరికి వారే ప్రచారం నిర్వహిస్తున్నారు.

ర్యాలీలో బీజేపీకి దూరం

సోమవారం పెదబయలు వారపు సంతలో నిర్వహించిన కూటమి ర్యాలీ ఈ విభేదాలను బహిర్గతం చేసింది. టీడీపీ, జనసేన నాయకులు తమ పార్టీల జెండాలతో ర్యాలీలో పాల్గొనగా.. ఏడు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు, మండల పార్టీ నాయకులు మాత్రం పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఎవరి ఓట్లు ఎవరికి?

పెదబయలు మండలంలో టీడీపీ జెడ్పీటీసీతో పాటు 11 ఎంపీటీసీ స్థానాల్లో, బీజేపీ ఏడు ఎంపీటీసీ స్థానాల్లో, జనసేన ఐదు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. దీంతో ఎంపీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూనే జెడ్పీటీసీ ఓటును మాత్రం ఓటర్ల ఇష్టానికే వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పోటీ చేస్తున్న ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు లభించే ఓట్లు జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి బదిలీ అవుతాయా? అన్నది అనుమానమేనన్న చర్చ నడుస్తోంది. బీజేపీ పోటీ చేస్తున్న ఏడు ఎంపీటీసీ స్థానాల పరిధిలోని జెడ్పీటీసీ ఓట్లు ఎటువైపు మొగ్గుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement