పాడేరు: ఈ నెల 5న నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. సోమవారం సాయంత్రం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకే ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వై.శృతి, పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


