గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు. దీంతో గిరిజనులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద సరుకులు పొందేవారు. వృద్ధులు, మహిళలు, మారుమూల గ్రామాల ప్రజలకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎండీయూ వాహనాల పంపిణీ వ్యవస్థను రద్దు చేసి తిరిగి డీఆర్ డిపోల ద్వారా సరుకులు అందించే విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో గిరిజనులు మళ్లీ రేషన్ కోసం డిపోల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి నిరీక్షించి, బియ్యం మూటలను తలపై మోసుకుంటూ ఇళ్లకు చేరుతున్నారు. డిపోలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలకు ఈ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.


