మన్యంలో భారీ వర్షం
సాక్షి, పాడేరు: మురసు తుపాన్ ప్రభావంతో మన్యంలో సోమవారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన వర్షం జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు మండలాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అర్నబ్ తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ నష్టం నుంచి కోలుకోకముందే మురసు తుపాను ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో కలవరపడుతున్నారు. మరోవైపు కొండవాగులు, గెడ్డల్లో వరద ఉధృతి పెరిగింది. ఏజెన్సీలోని ప్రధాన మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. గంపరాయి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం పెరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జోలాపుట్ రిజర్వాయర్‌కు కూడా ఇన్‌ఫ్లో పెరుగుతోంది.


