సాక్షి, పాడేరు: గత 80 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నివాసం ఉంటున్న తమను ఒడిశా అధికారులు వేధిస్తున్నారని పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ పరిధిలోని జమదంగి ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా కలెక్టర్, ఎస్పీ తమ గ్రామానికి వచ్చి ఒడిశాలో కలవాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు వేయకూడదని హెచ్చరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం జమదంగి గ్రామానికి చెందిన గిరిజనులంతా పాడేరు కలెక్టరేట్‌కు చేరుకుని అధికారులకు తమ సమస్యలను వివరించారు. దశాబ్దాలుగా ఏపీ పరిధిలోనే నివాసం ఉంటున్న తమపై ఒడిశా అధికారులు ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. తమకు ఒడిశా అధికారుల నుంచి రక్షణ కల్పించాలని, గతంలో మాదిరిగానే ఏపీలోని ఇంజరి పంచాయతీ పరిధిలో కొనసాగించాలని అధికారులను కోరారు.


