యలమంచిలి రూరల్ : యలమంచిలి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రం గురప్ప కల్యాణ మండపం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పరవాడ డీఎస్పీ బి.మోహన్‌రావు సోమవారం రాత్రి తెలిపారు. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 163 బీఎన్‌ఎస్‌ఎస్(144 సెక్షన్), 30 పోలీస్ యాక్ట్స్’ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజలు గుంపులు,గుంపులుగా తిరగడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. అనవసరంగా బయట తిరగవద్దన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపొందిన నాయకులు విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడానికి అనుమతి లేదన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు పట్టణంలోని అంతర్గత రహదారులను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


