● జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్
● పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పరిశీలన
పాడేరు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్ ఆదివారం పరిశీలించారు. పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు జి.మాడుగుల, చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణ, బ్యాలెట్ పత్రాల వినియోగం, ఓటింగ్‌కు సంబంధించిన రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట ఎన్నికల పరిశీలకుల లైజనింగ్ అధికారి పట్టాసి చలపతిరావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు భానుమూర్తిరాజు, విద్యాసాగర్, వెంకటరమణ, బాబునాయక్, ఎంపీడీఓలు తేజ్‌రతన్, సీతయ్య తదితరులు ఉన్నారు.


