జలాశయాలకు వరద పోటు | - | Sakshi
Sakshi News home page

జలాశయాలకు వరద పోటు

Nov 2 2026 1:41 AM | Updated on Nov 2 2026 1:41 AM

సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జలవిద్యుత్‌ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే బలిమెల జలాశయం ప్రమాద స్థాయికి చేరువైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జోలాపుట్టు రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో బలిమెలలో నీటిమట్టం పెరిగింది. ఆదివారం మధ్యాహ్నానికి పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులకు ఐదు అడుగుల దూరంలో చేరడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి సీలేరు (గుంటవాడ) రిజర్వాయర్‌లోకి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సీలేరు రిజర్వాయర్‌లో 1338 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి మట్టం 1360 అడుగులు. వరద ప్రవాహం కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డొంకరాయి ప్రధాన డ్యాం నీటిమట్టం 1030.60 అడుగులకు చేరడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని శబరి నదిలోకి విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు. ఉపనదుల నుంచి వరద ప్రవాహం, జలవిద్యుత్‌ కేంద్రం నుంచి విడుదలవుతున్న నీటితో ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో ఈ చర్యలు చేపట్టారు. బలిమెల నుంచి నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో సీలేరు, డొంకరాయి రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ కేవీ రాజారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement