యలమంచిలిలో 76.33 శాతం పోలింగ్‌! | - | Sakshi
Sakshi News home page

యలమంచిలిలో 76.33 శాతం పోలింగ్‌!

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

యలమంచిలి రూరల్‌: యలమంచిలి మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో 32 వార్డులకు ఆదివారం పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహించారు.ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైనప్పటికీ..10 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం 5 గంటల వరకు 76.08 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ముందు ప్రకటించిన అధికారులు..తరువాత 76.33 శాతంగా ప్రకటించారు. దివ్యాంగులు,వృద్ధులు,యువతీ, యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్డు పాఠశాలలో ఓటేశారు.వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి బొద్దపు తులసి,ఆమె భర్త బొద్దపు ఎర్రయ్యదొరలు పెదపల్లి స్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.బీజేపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి పిల్లా రమాకుమారి యలమంచిలి తులసీనగర్‌ కేంద్రంలో ఓటు వేశారు. గత మున్సిపల్‌ ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్‌ శాతం స్వల్పంగా తగ్గింది. బీఎల్‌వోలు ఓటరు స్లిప్పులను పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంతో కొందరు ఓటర్లకు తమ ఓటు ఏ బూత్‌లో ఉందో తెలియక ఓటు వేయకుండానే వెనుదురగడం కనిపించింది. పట్టణంలోని తులసీనగర్‌ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ విజయక్రిష్ణన్‌,పెదపల్లి,పట్టణంలో పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ తుహీన్‌ సిన్హా పరిశీలించారు. యలమంచిలి మున్సిపాలిటీకి సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను స్థానిక గురప్ప కల్యాణ మండపంలోని కౌంటింగ్‌ కేంద్రం స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. వీటి భద్రతకు మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొదటి అంచెలో రాష్ట్ర స్పెషల్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు, రెండో అంచెలో ఏఆర్‌ పోలీసులు, మూడో అంచెలో సివిల్‌ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

నర్సీపట్నంలో 72.60 శాతం..

నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ: పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురు, మదురు సంఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ సమయం కంటే ముందే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జోరుగా సాగింది. అక్కడి నుంచి 5 గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా సాగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో 40 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. 76 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 31 సమస్మాత్మక, ఏడు అత్యంత సమస్యాత్మక కేంద్రాలు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం కల్పించారు. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 49099 మంది ఓటర్లు ఉండగా 35674 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 72.60 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి ఆర్డీవో వి.వి.రమణ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీసారు. ఓటు వేసేందుకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేయించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ గపూర్‌ మున్సిపాలిటీలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ ముగిశాక కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్‌ బాక్స్‌లను డాన్‌ బాస్కో కళాశాలకు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement