చీడికాడ/నాతవరం/దేవరాపల్లి: అర్నాబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని కోనాం, తాండవ, రైవాడ జలాశయాల్లో నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. కోనాం జలాశయంలోకి ప్రస్తుతం 650 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, నీటిమట్టం 100.55 మీటర్లకు చేరింది. గరిష్ట ప్రమాద స్థాయి 101.25 మీటర్లు కావడంతో అదనపు నీటిని ప్రధాన గేట్ల ద్వారా దిగువ బొడ్డేరులోకి విడుదల చేస్తున్నారు. తాండవ రిజర్వాయరులో నీటిమట్టం 371.2 అడుగులకు చేరింది. ప్రస్తుతం రోజుకు 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా, ఖరీఫ్ సాగుకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు రైవాడ జలాశయంలో నీటిమట్టం 113.05 మీటర్లకు చేరింది. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రమాద స్థాయి 113.50 మీటర్లుగా అధికారులు తెలిపారు. నీటిమట్టం మరింత పెరిగితే స్పిల్‌వే గేట్ల ద్వారా శారదా నదిలోకి వరద నీటిని విడుదల చేయనున్నారు.


