నర్సీపట్నం: మున్సిపాలిటీలో రూ.267 కోట్లతో అభివృద్ధి చేశామని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నిధుల్లో రూ.185 కోట్లతో నిర్మించే రక్షిత మంచినీటి పథకం ఉందని ఆరోపించారు. 2014 టీడీపీ హయాంలో పట్టించుకోని అప్పటి మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ పథకాన్ని తెరమీదకు తెచ్చారన్నారు. వాస్తవంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రక్షిత మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.166 కోట్లు మంజూరు చేశామన్నారు. అప్పట్లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 80 కిలోమీటర్ల మేర చిన్న పైపులైను, 4 కిలోమీటర్ల మేర పెద్ద పైపులైను వేశామన్నారు. తమ ప్రభుత్వంలో మంజూరు చేసిన పథకాన్ని కూడా వారి ఖాతాలో వేసుకుని పురపాలిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రక్షిత మంచినీటి పథకం ఎవరు తీసుకువచ్చారో పట్టణ ప్రజలకు తెలుసునన్నారు.


