మునగపాక: మండలంలోని నాగులాపల్లి టీచర్స్ కాలనీలో చోరీ జరిగింది. బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపిన వివరాలు... నాగులాపల్లి టీచర్స్ కాలనీలో కుందురు వెంకటేశ్వరరావు అద్దెకు నివాసం ఉంటున్నారు. తన కోడలు గర్భవతి కావడంతో హైదరాబాద్‌కు ఈ నెల 23న వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం 9.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి వెనుక ఉన్న తలుపులు తీసి ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని అర తులం బంగారం, 16 తులాల వెండి పట్టీలు, కుంకుమ భరిణె చోరీకి గురైనట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న మునగపాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.


