● గుమ్మాఘాట్ వద్ద ప్రమాదం
● నలుగురికి తీవ్ర గాయాలు
● పాడేరు ఆసుపత్రికి ఒకరి తరలింపు
ముంచంగిపుట్టు: మండల కేంద్రం నుంచి జోలాపుట్టు వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై గుమ్మాఘాట్ వద్ద గురువారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మాకవరం పంచాయతీ సేబుగూడ గ్రామానికి చెందిన కె.అజిత్‌కుమార్, ఎల్.రాంచరణ్ బైకుపై ముంచంగిపుట్టు మండల కేంద్రానికి వస్తున్నారు. అదే సమయంలో ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా నందపూర్ బ్లాక్ తుభా పంచాయతీ కుకుడుపుట్టు గ్రామానికి చెందిన వంతాల సురేష్, వంతాల కమల బైకుపై జోలాపుట్టు వెళ్తున్నారు. గుమ్మాఘాట్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. బైకులు రెండూ ధ్వంసమయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ధరణి వారికి వైద్య సేవలు అందించారు. అజిత్‌కుమార్ తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని ధరణి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


