● రెండో రోజు హోరాహోరీ
● రాత్రి వరకు కొనసాగిన స్వీకరణ
సాక్షి, పాడేరు: పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు జోరందుకుంది. జిల్లాలోని 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఉద యం నుంచి రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పాడేరు జెడ్పీటీసీ అభ్యర్థి సీద రి రాంబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారి తిరుమణి శ్రీపూజకు రాంబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూడా వెంట ఉన్నారు. కొయ్యూరు నుంచి అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జి.మాడుగుల నుంచి వైఎస్సార్‌సీపీ నాయకురాలు చిట్టపులి మహేశ్వరి నామినేషన్లు దాఖ లు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, కాంగ్రెస్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు జిల్లాలోని పది జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 46 నామినేషన్లు స్వీకరించినట్లు ఆర్వో, జేసీ తిరుమణి శ్రీపూజ తెలిపారు. మండలాల వారీగా చింతపల్లి 5, గూడెంకొత్తవీధిలో 3, కొయ్యూరులో 4, జి.మాడుగులలో 4, పాడేరులో 5, డుంబ్రిగుడలో 3, అరకులోయలో 6, ముంచంగిపుట్టులో 3, హుకుంపేటలో 5, అనంతగిరిలో 2 నామినేషన్లు దాఖలయ్యాయి.


