ముంచంగిపుట్టు: ఒకప్పుడు ఓటు వేయాలంటే 5 నుంచి 14 కిలోమీటర్ల దూరం కాలినడకన, గుర్రాలపై ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటర్లకు కష్టంగా ఉండేది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా పేరున్న భూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు పంచాయతీల్లో ప్రస్తుతం పరిస్థితులు మారాయి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.46 కోట్లతో ఈ పంచాయతీ కేంద్రాలకు పక్కా రహదారులు నిర్మించారు. రాకపోకలు సులభం కావడంతో 2024లో జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయా పంచాయతీ కేంద్రాల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మూడు పంచాయతీల పరిధిలోని 56 గ్రామాలకు చెందిన 5,749 మంది ఓటర్లు సిద్ధమవుతున్నారు.
ఓటు కష్టాలకు ఇక తెర
మారుమూల పల్లెల్లోనే పోలింగ్ కేంద్రాలు
రహదారులతో మారిన పరిస్థితులు
పదేళ్ల తర్వాత సొంతూరిలో ఓటు
మూడు పంచాయతీలకు ఊరట
5,749 మంది ఓటర్లకు వెసులుబాటు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సౌకర్యాలు
స్థానిక ఎన్నికలకు ఓటర్లు సిద్ధం
అందుబాటులో పోలింగ్ కేంద్రం
గత కొన్నేళ్లుగా భూసిపుట్టు పంచాయతీలో పోలింగ్ కేంద్రాలు లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎన్నికలు ఏవైనా కుమడ పంచాయతీ కేంద్రానికి లేదా మద్దలబంద గ్రామానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చేది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణంతో రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయి. సుమారు పదేళ్ల తర్వాత 2024లో భూసిపుట్టులో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఓటు హక్కు వినియోగించుకున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– కిల్లో నాగేశ్వరరావు, ఓటరు, భూసిపుట్టు
అవస్థలు తప్పాయి
గతంలో మా గ్రామం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేవాళ్లం. మా పంచాయతీ కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. దూరాభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఓటు హక్కు వినియోగించుకునేవాళ్లం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తారు రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తవడంతో ఇప్పుడు మా ప్రాంతంలోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– నోబిన్, మాజీ సర్పంచ్, బుంగాపుట్టు


