ఉప్పొంగిన వాగులు | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన వాగులు

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవాహాలు దెబ్బతిన్న వంతెనలు, రహదారులు మారుమూలగ్రామాలకు నిలిచిన రాకపోకలు లోతట్టు ప్రాంతాలు జలమయం స్తంభించిన జనజీవనం

పాడేరు: అర్నాబ్‌ తుపాను తీవ్రతతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు కొండవాగులు, గెడ్డలు ఉగ్రరూపం దాల్చడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కించుమండ, చింతపల్లి, డముకు వారపు సంతలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఉప్పొంగుతున్న మత్స్యగెడ్డ.. నిలిచిన రాకపోకలు

ఏజెన్సీ వ్యాప్తంగా గెడ్డలన్నీ ప్రమాదకర స్థాయికి చేరగా, ప్రధానమైన ‘మత్స్యగెడ్డ’ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి, పెదబయలు మండలం పరదానిపుట్టు కాజ్‌వేల పైనుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. జి.మాడుగుల, పెదబయలు, పాడేరు మండలాల్లోని కుంబిడిసింగి, కించూరు, పెదకోడాపల్లి, కిముడుపల్లి, కుంతుర్ల పంచాయతీల పరిధిలోని దాదాపు 150 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

మూతపడిన పర్యాటక ప్రాంతాలు

మత్స్యగుండం వద్ద మత్స్యగెడ్డ ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో భక్తుల సందర్శనను నిలిపివేశారు. అలాగే జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతానికి వరదనీరు పోటెత్తడంతో ఆయా పర్యాటక కేంద్రాలను అధికారులు మూసివేశారు.

● హుకుంపేట మండలంలో రాళ్లగెడ్డ ఉధృతి పెరగడంతో కాజ్‌వేపై నీరు ప్రవహిస్తోంది. దీంతో చీడిపుట్టు, దొంతురాయి, బారాపల్లి పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి.

పెదబయలు: మండలంలోని గుల్లేలు పంచాయతీ కించూరు గెడ్డ, జామిగుడ గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే కుంతుర్ల, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని మచ్చుపల్లి – కన్నెలకట్లు గ్రామాల మధ్యలో గేదెగెడ్డ పొంగిపర్లుతోంది. కిముడుపల్లి పంచాయతీ చేదుపుట్టు గ్రామం సమీపంలో కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జామిగుడ, గిన్నెలకోట, కుంతుర్ల, గుల్లేలు పంచాయతీల్లో గెడ్డల ఉధృతి కారణంగా ఆయా గ్రామాలకు, మండల కేంద్రానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఫలితంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయి అత్యవసర సేవలు సైతం బందయ్యాయి.

చేదుపుట్టు కల్వర్టుపై పొంగి ప్రవహిస్తున్న వరద నీరు

కొయ్యూరు: ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో డీవీడీ ప్రసాదరావు, తహశీల్దార్‌ ప్రసాదరావు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ హెచ్చరించారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సాధ్యమైనంత వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో మంపలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. పూరి గుడిసెలు, కూలిపోయే దశలో ఉన్న శిథిలావస్థ ఇళ్లలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ పరిధిలోని పెద్దపాడు, కోసంగి, కోసంగి కాలనీ, చంపాపట్టి, శీలంగొంది, జాంకరవలస, ఊయ్యలగుడ, అమలగుడ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బందయ్యాయి. ముఖ్యంగా చాపరాయి నుంచి పెద్దపాడు, కోసంగి గ్రామాలకు వెళ్లే మార్గంలో గెడ్డ ఉగ్రరూపం దాల్చడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, వరద ఉధృతి కారణంగా చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల సందర్శనను ఐటీడీఏ అధికారులు మూడు రోజులుగా నిషేధించడంతో వస్తున్న పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. అలాగే, కించుమండలో ప్రతి బుధవారం జరిగే వారపు సంత భారీ వర్షాల కారణంగా రద్దయింది. వర్షాల ప్రభావంతో సొవ్వ పంచాయతీ కొరంజిగుడ గ్రామానికి చెందిన పొండొయి అప్పలరాజు అనే గిరిజనుడి ఇంటి బయటి గోడ తడిసి కూలిపోయింది.

సీలేరు: గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ నుంచి ఒడిశా వెళ్లే చిన్న గంగవరం మార్గంలోని తాత్కాలిక వంతెన మరోసారి కొట్టుకుపోయింది. పదిహేను రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇదే వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలికంగా పైపులు వేసి రాకపోకలు పునరుద్ధరించారు. అయితే, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండల నుంచి వరద ఉధృతంగా రావడంతో బుధవారం ఉదయం ఈ తాత్కాలిక వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. సరిహద్దు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు వంతెన అవతల ఉన్న ఎనిమిది గ్రామాల గిరిజనులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ యాసిన్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పిల్లిగడ్డ, మాదిగమల్లు, నిమ్మచెట్టు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

గూడెంకొత్తవీధి: లంకపాకలకు చెందిన జర్త గంగాభవానీ పూరిళ్లు పూర్తిగా కూలిపోయింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్ల గోడలు నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాదంతో నిలువ నీడ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణ సాయం అందించాలని ఆమె కోరుతున్నారు.

చింతపల్లి: మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గిరిజనులకు చెందిన రెండు నివాసాలు పూర్తిగా నేలకూలాయి. చింతపల్లి మండల కేంద్రంలోని సాయినగర్‌లో ఒక ఇల్లు, అలాగే చెరువులగొంది గ్రామానికి చెందిన పాంగి మహేష్‌కు చెందిన ఇల్లు వర్షానికి తడిసి కుప్పకూలాయి.

ముంచంగిపుట్టు: వనుగుమ్మ పంచాయతీ పరిధి లోని పనస గ్రామంలో ఈదురుగాలుల తీవ్రతకు భారీ పనస చెట్టు నేలకూలింది.బరడ పంచాయతీ బలియాగూడ నుంచి బురుసుందిపుట్టు వెళ్లే మలుపు వద్ద భారీ జీడి చెట్టు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక గిరిజనులు శ్రమించి చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

ప్రజలు అప్రమత్తత అవసరం: కలెక్టర్‌ నిశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement