చింతపల్లి: మండలంలో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో లాలం సీతయ్య అధ్యక్షతన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల అభినందన, సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. తాను ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ. 300 కోట్లు నిధులు మంజూరు చేస్తే.. చింతపల్లి ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసి బాలయ్య పడాల్ పోటీపడి కేవలం తమ మండలానికి రూ. 3 కోట్లు జిల్లా పరిషత్ నిధులు సాధించుకోవడం అభినందనీయమన్నారు. చాలా చోట్ల ఎంపీపీ, జెడ్పీటీసీల మధ్య సమన్వయ లోపాలు ఉంటాయని, కానీ చింతపల్లిలో ఎలాంటి బేదాభిప్రాయాలకు తావులేకుండా అభివృద్ధే ధ్యేయంగా పాలన ఆనందదాయకమన్నారు.
మహిళా సాధికారతకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట
ఈ ప్రాంతంలో మహిళలు రాజకీయంగా మరింత చైతన్యవంతం కావాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు. మన్యంలో మహిళా రాజకీయ చైతన్యానికి వైఎస్సార్‌సీపీయే నాంది పలికిందని, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ జీసీసీ చైర్మన్ శోభా స్వాతిరాణి తదితరులు ఇందుకు నిదర్శనమన్నారు. అత్యంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన తనకు వైఎస్సార్‌సీపీ అధినాయకత్వం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైన జెడ్పీ చైర్మన్ పదవి కేటాయించారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో పేర్కొన్నారు.
రానున్న స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం
మాజీ ఎంపీ మాధవి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో కీలకమని, ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసేలా శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీిసీలను ఘనంగా సత్కరించారు. వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు, డిప్యూటీ ఎంపీడీవోలు సీతామహాలక్ష్మి, మూర్తి, ఎంఈవో ప్రసాద్, బోడంనాయుడు, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర


