తనవద్ద పనిచేసే చిరుద్యోగిని లంచం డిమాండ్ చేసిన డీఆర్వో లోకేశ్వరరావు
రూ.50 వేలు తీసుకుంటుండగాపట్టుకున్న ఏసీబీ అధికారులు
కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు
పాడేరులో ఉలిక్కిపడిన అధికార యంత్రాంగం
ప్రభుత్వ శాఖల్లో అవినీతి మరోసారి బట్టబయలైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అధికారులే స్వయంగా లంచాలకు అలవాటు పడుతుండటానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.
సాక్షి, పాడేరు: పాడేరు కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపింది. తుపాను, వరదల సమీక్షలతో కలెక్టరేట్ అంతా బిజీగా ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా డీఆర్వో కార్యాలయంలోకి ప్రవేశించారు. ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అమ్ము సూర్యచక్రవర్తి నుంచి ఇన్‌చార్జ్ డీఆర్వో ఎంవీఎస్ లోకేశ్వరరావు రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లంచం డిమాండ్ వెనుక అసలు కారణం
జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తికి సంబంధించి 2024లో రెగ్యులర్ పే–స్కేల్ క్రమబద్ధీకరణ, వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాల్సి ఉంది. సుమారు రూ. 18 లక్షల బిల్లులకు గాను ట్రెజరీ, ఇతర ఖర్చుల నిమిత్తం ఇన్‌చార్జ్ డీఆర్వో లోకేశ్వరరావు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు చక్రవర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, ఈ దాడి జరిగినట్లు ఏసీబీ ఏఎస్పీ హర్షిత తెలిపారు.
నిందితుడి నేపథ్యం.. అరెస్ట్:
లోకేశ్వరరావు 2005లో ఎకై ్సజ్ ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరి, 2010లో సీఐగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖలోకి వచ్చి గాజువాక, పద్మనాభంలో తహసీల్దార్‌గా పనిచేశారు. గత ఏడాది జనవరిలో పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొద్ది నెలలుగా డీఆర్‌వో పోస్టు ఖాళీగా ఉండడంతో ఈయన ఇన్‌చార్జ్ డీఆర్వోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు కీలక పోస్టుల్లో ఉన్న ఆయనపై ఇటీవల అవినీతి ఆరోపణలు పెరిగాయి. చివరకు తన సొంత కార్యాలయంలోని చిరు ఉద్యోగి నుంచే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం జిల్లాలో సంచలనం సృష్టించింది.
రిమాండ్‌కు తరలింపు
నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ ఏఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా అవినీతికి సంబంధించిన ఘటనలు జరిగితే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా మొబైల్ నంబర్ 9440440057 ద్వారా సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు.


