అర్జీదారుల సమస్యలపై
తుమ్మపాల : పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల గూర్చి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి పరిష్కారం కాని దరఖాస్తుల గూర్చి వారికి అందుకు గల కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. ప్రతిశాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేసి, గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొత్తం 559 అర్జీలు నమోదు కాగా రెవెన్యూ శాఖ 338, మిగిలినవి వివిధ శాఖల్లో నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్‌రాజా, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు
రెవెన్యూ రికార్డుల తారుమారుపై ఫిర్యాదు
అనకాపల్లి జీవీఎంసీ విలీన గ్రామం రాజుపాలెం సర్వే నెం.176/6లోని 22 సెంట్ల భూమిని ఆన్‌లైన్‌లో తొలగించి ఇతరుల పేరున తారుమారు చేసి భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఎరుకువానిపాలేనికి చెందిన గైపూరి సూరమ్మ అనే వృద్ధుఽరాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.1996లో ఖాతా నెం.75 పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారని, సాగుచేసుకుంటూ ప్రతి ఏటా రైతు భరోసా కూడా వచ్చేదని, ఇటీవల కొందరు వ్యక్తులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కె తన భూమిని ఆన్‌లైన్‌లో తొలగించారని, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు భూమి రికార్డును యథావిధిగా తనకు అప్పగించాలని కోరింది.
జనావాసాల నడుమ
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దంటూ నిరసన
చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మరోచోటకు మార్చాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ ఊరు మధ్యలో మంచినీరు ట్యాంకు, మంచినీటి కుళాయిలు, స్కూల్ పిల్లలు, నివాస గృహాలు, నిరంతరం ప్రజలు సమావేశం అయ్యే ప్రాంతం మధ్య ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణం చేపట్టాలని అధికారులు చేసిన ఆలోచనను తక్షణమే వెనక్కు తీసుకుని మరో చోట ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే నిర్మించిన ట్రాన్ప్‌ఫార్మర్‌ను దిమ్మను తక్షణమే కోరారు.


