పాడేరు రూరల్: స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం అన్నసమారాధన నిర్వహించారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు, స్థానిక పూర్వపు సీఐ దీనబంధు దంపతుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. శెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గతంలో పాడేరు పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహించిన దీనబంధు ఇటీవల విశాఖపట్నంకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి మొక్కు తీర్చుకునేందుకు ఆయన కుటుంబసమేతంగా ఆదివారం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోటిబాబు, సతీష్, చంద్రమోహన్, సూర్యప్రకాష్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


