● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక
పెదబయలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి పాలన నచ్చకనే టీడీపీతో పాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఆదివారం పెదబయలు మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కుటుంబాలు పార్టీలో చేరాయి. మండలంలోని ఇంజరి పంచాయతీ పరిధిలోని చంపాడు, మాలసీతకోట, సరియాపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు కిముడు చిట్టిపడాల్, గొల్లోరి సత్యనారాయణ, కొర్ర చిన్నారావు, కిల్లో లోకేష్‌లతో పాటు మరో ఆరు కుటుంబాలు ఎమ్మెల్యే మత్స్యలింగం సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే పెదబయలు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి పెనుమాల రాధాకృష్ణ కూడా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నేరుగా అందేవని, కానీ ప్రస్తుత కూటమి పాలనలో సంక్షేమం గిరిజనులకు అందనంత దూరంలో ఉండిపోయిందని విమర్శించారు. అందుకే టీడీపీ సహా ఇతర కూటమి పార్టీల నుంచి చేరికలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.


