స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

పెదబయలు: అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఎంతో బలంగా ఉందని, క్యాడర్‌ అంతా సమష్టిగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మార్కెట్‌ యార్డులో మండల పార్టీ అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం నిష్టతో పనిచేసే ప్రతి ఒక్కరికీ రాబోయే రోజుల్లో తగిన స్థానం, గుర్తింపు లభిస్తాయని చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు పదవులపై ఆశపడటం సహజమే అయినప్పటికీ అందరికీ ఒకేసారి అవకాశం రాకపోవచ్చని, అవకాశం రాని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు అండగా నిలిచి, పంచాయతీలు, సెగ్మెంట్ల వ్యాప్తంగా విజయం సాధించి పార్టీ జెండాను రెపరెపలాడించాలని కోరారు.

కూటమి పాలనపై తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో కూటమి పాలనలో సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలకు హామీలిచ్చి మరిచారని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, కాలం గడుస్తున్నా ఆ హామీ ఊసే ఎత్తడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తామని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దగా చేశారని విమర్శించారు. నూతన పింఛన్లు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేవలం 9 రోజులు మాత్రమే పోర్టల్‌ తెరచి, కఠిన నిబంధనలు పెట్టి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో వాలంటీర్లు నేరుగా ఇళ్లకు వచ్చి ధ్రువపత్రాలు తీసుకుని పింఛన్లు, రేషన్‌ సరుకులు అందించేవారని.. నేడు డిపోల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కూటమి పాలనపై ప్రజలు విసుగు చెందారని, స్థానిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే మత్స్యలింగం చేతుల మీదుగా పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ ఐడీ కార్డు పొందిన ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద బీమా సదుపాయం లభిస్తుందని తెలిపారు. ఐడీ కార్డులు రాని వారికి త్వరలోనే నమోదు చేయించి అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను మండల పార్టీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు, స్థానిక జెడ్పీటీసీ కూడా బొంజుబాబు, గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు సందడి కొండబాబు, మాజీ జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని, మాజీ వైస్‌ ఎంపీపీ వంతాల అప్పారావు, నాయకులు వంతాల రామన్న, ధనలక్ష్మి, నవీన్‌, కనకరాజు, కిముడు చిట్టిబాబు, పార్టీ ఉపాధ్యక్షుడు పల్టాసింగి ధనరాజ్‌, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, బూత్‌ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement