కలెక్టర్ నిశాంతి
పాడేరు: ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం, సులభతరం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో, ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి ప్రజలు నేరుగా వచ్చేందుకు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పీజీఆర్‌ఎస్ క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ టి. నిశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సుదూర మారుమూల గ్రామాల నుంచి ప్రజలు ఐటీడీఏ లేదా మండల కేంద్రాలకు వ్యయప్రయాసలకోర్చి రావాల్సిన అవసరం లేకుండా ఈ నూతన విధానాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు.
ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు
ఈ క్యూఆర్ కోడ్ విధానం ద్వారా గిరిజనులు, ఫిర్యాదుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ గ్రామం నుంచే స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించి పీజీఆర్‌ఎస్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో తమ సమస్యలను సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు.
అన్ని సచివాలయాల్లో క్యూఆర్ కోడ్‌ల ప్రదర్శన
సమస్యల నమోదు, పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ఈ పీజీఆర్‌ఎస్ క్యూఆర్ కోడ్‌లను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, రద్దీగా ఉండే ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు, ప్రజలంతా ఈ ఆన్‌లైన్ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


