పాడేరు జిల్లాలో పేద గిరిజనులకు పక్కా ఇళ్ల మంజూరు ఇప్పటికీ ఒక అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. హౌసింగ్ 2.0 పేరుతో ప్రభుత్వం సర్వేలు నిర్వహించి ఏడాదిన్నర గడుస్తున్నా, ఒక్క గృహం కూడా మంజూరు చేయకపోవడంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, కూటమి ప్రభుత్వం తమను మోసగిస్తోందని మండిపడుతున్నారు. కనీస వసతులు లేక కూలిపోయే దశలో ఉన్న మట్టిగోడల గుడిసెల్లోనే గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
అనంతగిరి మండలం బల్లగరువులో
గిరిజనులు నివాసం ఉంటున్న గుడిసెలు
సాక్షి, పాడేరు: జిల్లాలో పేద గిరిజనులకు పక్కా ఇళ్ల మంజూరు కలగానే మిగిలిపోయింది. పేదల ఇళ్ల సర్వే పూర్తి చేసి ఏడాదిన్నర అవుతున్నా, కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. హౌసింగ్ 2.0 పేరిట గ్రామాల్లో ఇళ్ల మంజూరుకు చేపట్టిన సర్వే కేవలం ఉత్తిదే అంటూ గిరిజనులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
● 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇళ్లు లేని పేదలకు 2 నుంచి 3 సెంట్ల ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేస్తామని, ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, గిరిజన ప్రాంతాల పేదలను ఆ ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం అన్యాయమని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ ఆదివాసీలకు అమలు చేస్తున్న పీఎం జన్‌మన్ ఇళ్లు మినహా, కూటమి ప్రభుత్వం మిగిలిన గిరిజన జాతుల పేదలకు ఎలాంటి గృహాలు మంజూరు చేయలేదు. కొత్త ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేద గిరిజనులంతా ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
జిల్లాలో 56,491 పేద కుటుంబాల సర్వే
జిల్లాలోని ఇళ్లు లేని వివిధ గిరిజన తెగల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం 2.0 పేరిట సర్వే చేపట్టింది. పీఎంఏవై ఇళ్లు మంజూరు చేసే లక్ష్యంతో ఇళ్లు లేని 56,491 పేద గిరిజన కుటుంబాలను గృహనిర్మాణ సంస్థ, ఇతర అధికారులు ఈ సర్వేలో గుర్తించారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఆ సర్వే ఆధారంగా ఇళ్లను మంజూరు చేయలేదు. పీఎంఏవై ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ పేద గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను అధికారులు పట్టించుకోలేదు.
దయనీయంగా నివాసాలు
జిల్లా వ్యాప్తంగా ఇళ్లు లేని పలు జాతుల గిరిజనులు దుర్భర జీవనం సాగిస్తున్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న మట్టిగోడల గుడిసెల్లో వారు నివాసం ఉంటున్న తీరు చూసేవారిని ఆవేదనకు గురిచేస్తోంది. అయినప్పటికీ, కూటమి ప్రభుత్వ పాలకుల నుంచి ఎలాంటి స్పందన కరువైంది.
● గత ఏడాది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించిన అనంతగిరి మండలం బల్లగరువులోనూ గిరిజనులు కూలే దశలో ఉన్న గుడిసెల్లోనే నివసిస్తున్నారు. గిరిజనుల మట్టిగోడల ఇళ్ల దుస్థితిని స్వయంగా చూసినప్పటికీ, ఆ మారుమూల గ్రామానికి కూడా ఇప్పటివరకు పక్కా గృహాలు మంజూరు కాలేదు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పీవీటీజీలు మినహా గిరిశిఖర గ్రామాల్లోని వివిధ జాతుల గిరిజనులంతా పక్కా గృహాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలివానల సమయంలో మట్టిగోడల గుడిసెలు, పెంకుల ఇళ్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, వేరే దారి లేక ఆయా గిరిజనులు భయంభయంగానే కాలం వెళ్లదీస్తున్నారు.
సర్వేలు పూర్తి చేసి ఏడాదిన్నర గడిచినా మంజూరు కాని ఇళ్లు
56,491 మంది పేదల ఎదురుచూపు
మట్టిగోడల గుడిసెల్లో భయంభయంగా నివాసం
గిరిజనుల పక్కా ఇళ్ల కలలపై నీళ్లు
కూటమి ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై గిరిజనుల ఆగ్రహం!
ఇబ్బందులు పడుతున్నాం
గుడిసెల్లో జీవిస్తున్న తమకు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని పాలకులను, అధికారులను వేడుకుంటున్నా న్యాయం జరగడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఏడాది మా గ్రామం పర్యటన సమయంలో కొత్త ఇళ్లకు సర్వే చేశారు. కానీ ఇప్పటికి ఒక్కరికి కూడా పక్కా ఇల్లు మంజూరు కాలేదు. మట్టిగోడల గుడిసెల్లో కుటుంబాలతో దుర్భర జీవనం సాగిస్తున్నాం.
– చింత గంగమ్మ, బల్లగరువు,
పినకోట పంచాయతీ, అనంతగిరి మండలం
తొందరలోనే ఇళ్లు మంజూరు
జిల్లాలో 2.0 సర్వే పూర్తి చేసిన గిరిజన లబ్ధిదారులకు తొందరలోనే పక్కా గృహాలు మంజూరు అవుతాయి. అర్బన్ ఏరియాల్లో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల మంజూరును ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లోనూ సర్వేలో అర్హులైన అన్ని కుటుంబాలకు ఇళ్ల నిర్మాణాలు చేపడతాం.
– బాబునాయక్, పీడీ,
జిల్లా గృహనిర్మాణసంస్థ


