నకిలీ ఫోన్‌పే మోసాల గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ ఫోన్‌పే మోసాల గుట్టురట్టు

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

అక్కిరెడ్డిపాలెం (విశాఖ): నకిలీ ఫోన్‌పే యాప్‌ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును గాజువాక క్రైం పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం గాజువాక క్రైం విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ క్రైమ్‌ డీసీపీ ఎన్‌.రమ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న బీహెచ్‌పీవీ జంక్షన్‌ ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వచ్చిన బోరా వెంకటరమణను నిందితుడు బుద్ధ హేమసాయి మోసం చేశాడు. తనకు అత్యవసరంగా నగదు అవసరమని నమ్మించి, ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పి అతని వద్ద నగదు తీసుకున్నాడు. అనంతరం నకిలీ ఫోన్‌పే, వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ చూపించి పరారయ్యాడు. ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైమ్‌ సీఐ జీడీ బాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి, ఈ నెల 17న శ్రీనగర్‌ ఏటీఎం వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక మొబైల్‌ ఫోన్‌, రూ.2,04,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోస్టల్‌ ఉద్యోగే సూత్రధారి

ప్రధాన నిందితుడు బుద్ధ హేమసాయి పాడేరు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌గా (ఏబీపీఎం) విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం మెడికల్‌ లీవ్‌లో ఉన్న అతను, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తన స్నేహితులతో కలిసి ఈ మోసాలకు పాల్పడ్డాడు. నకిలీ ఫోన్‌పే యాప్‌లను ఉపయోగించి ఏటీఎంల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని వరుస మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులపై నగరంలో ఇప్పటికే 14 కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు హేమసాయి, కోరుబిల్లి తరుణ్‌, శరగడం మురారి, జంజాల గౌతమ్‌ గగన్‌ చంద్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సూరిశెట్టి హేమంత్‌ పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఏసీపీ వెంకట్రావు, సీఐ జీడీ బాబు, ఎస్‌ఐ హరికృష్ణతో పాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

నలుగురు నిందితుల అరెస్ట్‌,మరో నిందితుడు పరారీ

రూ.2.04 లక్షల నగదు,మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం

పాడేరు పోస్టల్‌ ఉద్యోగే కీలక సూత్రధారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement