● కార్యకర్తలే పార్టీకి శ్రీరామరక్ష
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
పాడేరు: రానున్నది వైఎస్సార్‌సీపీ శకమేనని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. పట్టణంలోని లోచలిపుట్టులో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు అధ్యక్షతన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు దక్కాలని, సముచిత న్యాయం జరగాలనే లక్ష్యంతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అందుకనుగుణంగానే పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా ఐడీ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఐడీ కార్డులు అందుకున్న గ్రామ పంచాయతీ, గ్రామ కమిటీలు ప్రతి గడపకూ వెళ్లి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అరాచకాలు, అన్యాయాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై పెద్దఎత్తున నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి అత్యంత కీలకమని విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. ఎక్కడా కూడా కూటమి పార్టీల తరఫున ఏకగ్రీవాలు జరగకుండా గట్టిగా అడ్డుకోవాలన్నారు. పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, పార్టీ మద్దతుదారులు ఘనవిజయం సాధించేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పార్టీ కమిటీలకు నూతన ఐడీ కార్డులను అందజేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడ సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాాలు కురుసా పార్వతమ్మ, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూతంగి సూరిబాబు, పార్టీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు కూడ సుబ్రమణ్యం, పలువురు ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


