ఉద్యమం తీవ్రతరం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమం తీవ్రతరం

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

● ఆదివాసీ గిరిజన సంఘ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స హెచ్చరిక

అధికారులు మాటతప్పితే

పాడేరు రూరల్‌: జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఇచ్చిన మాట తప్పితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స హెచ్చరించారు. మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ గత నెల రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలు, ఆందోళనలను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఇచ్చిన హామీ మేరకు విరమించినట్లు ఆయన శనివారం తెలిపారు. అనంతరం పీవో సమక్షంలో వివిధ పాఠశాలల విద్యార్థులను తిరిగి మారికవలస పాఠశాలలో చేర్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్‌, పీవో తమ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, వారిపై ఉన్న నమ్మకంతోనే తాము ఆందోళన విరమించామని తెలిపారు. అయితే, సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతుల ప్రకారం విద్యార్థులను మళ్లీ పాఠశాల నుంచి పంపించేస్తారనే వార్తలు నిజమైతే మాత్రం ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు.

ఐక్య ఉద్యమంతోనే స్పందించిన అధికారులు

అధికారులు ఇచ్చిన హామీలతోనే ఆందోళన విరమించి విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించామని, ఒకవేళ అధికారులు గానీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గానీ మాట మార్చితే ఉద్యమం తారాస్థాయికి చేరుతుందని స్పష్టం చేశారు. అధికారుల హామీతో ఆందోళనలు విరమించిన విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘం, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఐటీడీఏ ముఖద్వారం వద్ద సమావేశమై థింసా నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఐక్య పోరాటంతోనే సమస్యకు పరిష్కారం లభించిందని ప్రజాసంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, హెచ్‌ఆర్‌ఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ శోభ (చిన్ని), ఆదివాసీ మహిళా సంఘం నేత హైమవతి, ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీ నాయకుడు వైకుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నారావు, నాయకులు కొత్తయ్య, భీమరాజు, భాను, విమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement