దిగొచ్చిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన ప్రభుత్వం

Aug 30 2026 12:15 AM | Updated on Aug 30 2026 12:15 AM

● మారికవలస చేరుకున్న 37 మంది విద్యార్థులు

మధురవాడ: అర్ధరాత్రి బలవంతంగా వివిధ ప్రాంతాలకు తరలించిన 9, 10 తరగతులకు చెందిన కొంతమంది విద్యార్థులు శనివారం మారికవలసలోని గురుకులానికి తిరిగి వచ్చారు. ఇక్కడ ఉన్న ఏపీ గిరిజన గురుకుల సంక్షేమ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ను ప్రభుత్వం సీవోఈగా మార్చాలని నిర్ణయించడంతో రెండు రోజుల క్రితం ఈ పాఠశాలకు చెందిన 480 మంది విద్యార్థులను అధికార యంత్రాంగం అర్ధరాత్రి పోలీసు పహారా మధ్య బలవంతంగా తరలించింది. ఈ క్రమంలో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్సార్‌ సీపీ, ప్రజా సంఘాలు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఇక్కడి నుంచి వెళ్లిన విద్యార్థులు తమ ఇళ్లకు, ఇతర గురుకులాలకు వెళ్లకుండా మారికవలస గురుకుల ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ను అక్కడే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాలతో కలిసి పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. మారికవలస గురుకుల ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ను అక్కడే కొనసాగిస్తామని అధికారులు ప్రకటించారు. అనంతరం అక్కడ నుంచి 37 మంది విద్యార్థులను తిరిగి పంపించారు.

అంతా అయోమయం

ప్రజా సంఘాలు, వైఎస్సార్‌సీపీ ఆందోళనలకు తలొగ్గి 37 మంది విద్యార్థులను వెనక్కి పంపించారు. అయితే మారికవలసలో సీవోఈ పేరుతో సుమారు 270 మంది వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఒకటి రెండు రోజుల్లో మరో 300 మంది బాలికలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ భవనాలకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ ఉంటారు? అనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైస్కూల్‌ బాలుర వసతి, చదువుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement