గురుకులంలో సర్కారు గందరగోళం! | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో సర్కారు గందరగోళం!

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

తరగతుల తరలింపు నిర్ణయంపై ఆగ్రహావేశాలు

ఇప్పటికే 5, 6, 7 తరగతులు అక్కడే కొనసాగించాలని ఆందోళనలు

తాజాగా 10వ తరగతిలోపు బాలురందరినీ తరలించాలని ఆదేశాలు

భగ్గుమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

మధురవాడ: పేద గిరిజన విద్యార్థుల బతుకులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ‘ఎక్సలెన్స్‌’ ముసుగులో వందలాది మంది అమాయక విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 5, 6, 7 తరగతుల తరలింపు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి ఆక్రందనలను నిర్దాక్షిణ్యంగా తొక్కిపెట్టింది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, ఏకంగా 10వ తరగతిలోపు ఉన్న బాలురందరినీ గెంటేసి పాఠశాలకే ఎసరు పెట్టే ఆలోచన చేస్తోంది. విద్యార్థుల ఆందోళనలను కనీసం పట్టించుకోకుండా, వారిని బలవంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టాలని ఉన్నతాధికారుల నుంచి అప్పటికప్పుడు హుకుం జారీ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఒకరి చదువు కోసం ఇంకొకరి బతుకును బలిపీఠం ఎక్కించే ఈ కుట్రపూరిత వైఖరిపై గిరిజన వర్గాల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

జీవో 69 ముసుగులో నిర్వాకం

గతంలో తెచ్చిన జీవో నంబర్‌ 69 ద్వారా మారికవలస బాలికల స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(ఎస్‌వోఈ), తిమ్మాపురం రోడ్డులోని గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతుల విద్యార్థులను తరలించి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా భావించారు. అయితే ఆ పరిధిని ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా విస్తరించారు. బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి లోపు చదువుతున్న వందలాది మంది విద్యార్థులందరినీ ఏకపక్షంగా ఖాళీ చేయించాలని నిర్ణయించారు. దీంతో పాఠశాల ఉనికితో పాటు అక్కడ చదువుతున్న పేద విద్యార్థుల విద్యా భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది.

ఒకరి కోసం మరొకరు బలి?

మారికవలస బాలికల ఎస్‌వోఈలో ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ చదువుతున్న 300 మందిని, మారికవలస ఆర్‌ఎస్‌లోని మరో 300 మంది విద్యార్థులను కలిపి మొత్తం 600 మందికి ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ పేరుతో ఒకే ప్రాంగణంలో నీట్‌, ఐఐటీ కో–ఎడ్యుకేషన్‌ శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మంచిదే అయినా, అందుకోసం ఏళ్ల తరబడి ఇక్కడే చదువుకుంటున్న పాఠశాల స్థాయి చిన్నారులను బలవంతంగా వెళ్లగొట్టడం ఎంతవరకు న్యాయమని ప్రజా, విద్యార్థి, గిరిజన సంఘాలతో పాటు తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. 600 మంది ఇంటర్‌ విద్యార్థుల కోసం కొత్త వసతులు కల్పించకుండా, అమాయక బాలుర బతుకులను రోడ్డున పడేసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. గురుకుల విద్యార్థులకు స్థిరమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, దాన్ని ఒక్కసారిగా మార్చే నిర్ణయాలు వారి చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement