విశాఖను అదాని‘పట్నం’గా మార్చొద్దు | - | Sakshi
Sakshi News home page

విశాఖను అదాని‘పట్నం’గా మార్చొద్దు

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

అదానికి అప్పనంగా కేటాయించిన భూములు రద్దు చేయాలి

డేటా సెంటర్‌తో విశాఖ వినాశం

ప్రభుత్వం తీరుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

శ్రీనివాసరావు ఆగ్రహం

ఎంవీపీకాలనీ: విచక్షణారహితంగా భూ కేటాయింపులు చేస్తూ విశాఖను ధ్వంసం చేసి, దానిని ‘అదానిపట్నం’గా మార్చవద్దని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ముడసర్లోవ జలాశయం, అక్కడి డేటా సెంటర్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే మధురవాడలో అదానికి కేటాయించిన 300 ఎకరాల భూమి ఇంకా వినియోగంలోకి రాకుండానే, తాజాగా ముడసర్లోవలో సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ కేటాయింపుల వల్ల విశాఖ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా పరిష్కారం కాని సింహాచలం పంచగ్రామాల సమస్యను పక్కనపెట్టి, అదానికి భూములు ధారాదత్తం చేస్తున్న తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో అదాని అబద్ధాలను నమ్మి మంత్రి లోకేష్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రాజెక్టుపై ఎలాంటి నిపుణుల నివేదిక, లాభనష్టాల విశ్లేషణ లేకుండానే మాట్లాడటం సరికాదని అన్నారు. హిందుత్వ పరిరక్షణ పేరుతో ప్రచారం చేసుకునే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీలు అప్పన్న దేవస్థాన భూములు అదానికి వెళ్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో రుషికొండ అంశంపై గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు విశాఖలో మూడు కొండలను బోడిగుండ్లుగా మారుస్తున్నారని, ఆ ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ముడసర్లోవలో డేటా సెంటర్‌ ఏర్పాటు వల్ల విశాఖ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి యం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్‌ బి.గంగారావు, ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, పి.మణి, వి.కృష్ణారావు, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement