రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేయాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేయాలని ధర్నా

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

ఎస్‌.రాయవరం: నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న రైతుపై రెవెన్యూ అధికారులు దౌర్జాన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు అడ్డురోడ్డులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులను, ముఖ్యంగా తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్‌ చేసి, బాధిత రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. బాధిత రైతు గోసల దేముడు భార్య రామయ్యమ్మ, ఆయన అల్లుడు, ఎస్‌.రాయవరం మండలం వైస్‌ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, రైతు సంఘ నాయకుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ రాజయ్యపేట గ్రామంలోని సర్వే నంబర్లు 231/3బీలో ఎకరా 11 సెంట్లు, 231/5లో ఎకరా 45 సెంట్లు, 235/5లో 80 సెంట్లు కలిపి మొత్తం 3 ఎకరాలు 37 సెంట్ల భూమిని 2023లో ఏపీఐఐసీ భూసేకరణ సమయంలో మినహాయింపుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే అదే భూమిలోకి బుధవారం నక్కపల్లి తహసీల్దార్‌ అక్రమంగా ప్రవేశించి, మొక్కలకు నీరు పోస్తున్న రైతు గోసల దేముడితో వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. పెద్దగా అరుస్తూ భయాందోళనలకు గురి చేయడంతో అప్పటికే అనారోగ్యంతో ఉన్న దేముడు స్పృహ తప్పి కుప్పకూలిపోయారని తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది పొలంలో ఉన్న వస్తువులను తొలగించారని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్లు 12, 20లను, న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు వ్యవహరించారని విమర్శించారు. బాధిత రైతుకు తక్షణమే మెరుగైన వైద్యం అందించడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో రామలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఘటనపై స్పందించిన ఆర్డీవో.. విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎం.మహేష్‌బాబు, జె.అప్పలరాజు, సిహెచ్‌.రాజు, గోపాలకృష్ణ, ఎం.రమణ, జి.కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement