అప్పుల బాధతో లారీ డ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో లారీ డ్రైవర్‌ ఆత్మహత్య

Aug 21 2026 2:39 AM | Updated on Aug 21 2026 2:39 AM

సబ్బవరం: అప్పుల బాధ తాళలేక ఓ లారీ డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పైడివాడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసకపల్లి శివారు ఎరుకునాయుడుపాలెం గ్రామానికి చెందిన గౌర నీలకంఠేశ్వరరావు(35) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పైడివాడకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తలు పైడివాడ బీసీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. జ్యోతి నాన్నమ్మ అనారోగ్యంతో ఉండటంతో రెండు రోజుల క్రితం ఆమెను చూసేందుకు జ్యోతి మరో వీధిలోని నాన్నమ్మ ఇంటికి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన ఆమె, భర్త ఆచూకీ కోసం ఇంటి పక్కనే నివసిస్తున్న మహిళను అడగగా.. తెల్లవారుజామున నీలకంఠేశ్వరరావు తన తాతకు చెందిన మామిడి తోట వైపు వెళ్లినట్లు ఆమె తెలిపింది. దీంతో జ్యోతి తోటకు వెళ్లి చూడగా.. నీలకంఠేశ్వరరావు మామిడి చెట్టుకు నైలాన్‌ తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు జ్యోతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement