రైతులు, అధికారులను కలవరపెడుతున్న తాండవ
నీరు విడుదల చేసి వారం దాటిన శివారుకు పారని నీరు
గెడ్డలో మోటార్లు, వ్యవసాయ బోర్లతో వరినారు కాపాడుకుంటున్న రైతులు
నాతవరం: వరుణు దేవుడు కరుణించక తాండవ రిజర్వాయరు నుంచి నీటిని విడుదల చేసి వారం రోజులు గడిచినా శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించలేదు. తాండవ రిజర్వాయరు పరిధిలో అధిక శాతం రైతులు వరినారును కాపాడుకునే పరిస్ధితిలో ఉన్నారు. గతంలో తాండవ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన వారం రోజుల వ్యవధిలో శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించేది. ఈ ఏడాది వరుణుదేవుడు కన్నెర్ర చేయడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాండవ రిజర్వాయరు నీరు అధారంగా ప్రతి ఏటా ఖరీఫ్‌లో కాకినాడ, అనకాపల్లి జిల్లాల పరిధిలో 52 వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తుంటారు. ఈనెల 11న తాండవ నుంచి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే వారం దాటుతున్నా శివారు ఆయకట్టు భూములకు చుక్కనీరు కూడా అందలేదు. కాలువ ద్వారా రోజుకు 750 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా కోటవురట్ల, నర్సీపటం, కోటనందూరు, రవతలపూడి మండలాల పరిధిలో నేటికీ శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించలేదు. ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ బోర్లు లేదా గెడ్డలో మోటార్ల సాయంలో వరినారు ఎండిపోకుండా బతికించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటి వరకూ 300 హెక్టార్లలోనే...
నాతవరం మండలంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 6,297 హెక్టార్లు కాగా మంగళవారం సాయంత్రానికి కేవలం 300 హెక్టార్లు మాత్రమే రైతులు వరినారులు వేనినట్లుగా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోనే ఖరీఫ్ సీజన్‌లో వరి పంట నాతవరం మండలంలోనే అధికంగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ సమయం సమీపిస్తున్న వరినాట్లు మందకొడిగా వేస్తున్నారు. గతంలో ఈ సమయానికి తాండవ ఆయకట్టు పరిధిలో వరినాట్లతో పచ్చగా కన్పించే పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. తాండవ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినా ఎండ తీవ్రత కారణంగా నీరు ప్రవహించక రైతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది ఖరీ్‌్‌ఫ్‌లో వరి పంట సాగుపై సందిగ్ధత నెలకొంది. నేటికి కేవలం 300 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు పడడం పట్ల వ్యవసాయశాఖాధికారి సుగుణ ఆందోళన వ్యక్తం చేశారు. కాలువలు నిండుగా నీరు విడుదల చేస్తున్నందున తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్టిపోతుందని ప్రాజెక్టు డీఈఈ అనురాద తెలిపారు. అయితే కాలువ కింద ఇంకా శివారు ఆయకట్టుకు నీరు అందలేదు.


