● లారీ బ్రేక్ ఫెయిల్
● అప్రమత్తమైన డ్రైవర్
● కొండను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు
● కాసేపటికే ప్రాణాలు వదిలిన వైనం
కొయ్యూరు : పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి నుంచి నర్సీపట్నం ఎరువుల లోడుతో వస్తున్న లారీ చింతాలమ్మ ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిలై అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో లారీ పక్కనే ఉన్న కొండను బలంగా ఢీకొట్టింది. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన డ్రైవర్ నలపు కృష్ణ (51) తీవ్రంగా గాయపడి, కొద్దిసేపటికి మృతి చెందారు. చింతాలమ్మ ఘాట్ ఎక్కిన తర్వాత డౌన్‌లో లారీకి బ్రేకులు పనిచేయలేదు. అయినప్పటికీ డ్రైవర్ కొంత దూరం వరకు లారీని ఎంతో ధైర్యంగా అణచి ఉంచారు. చివరకు నాలుగో మలుపు వద్ద లారీని కొండ వైపుగా మళ్లించి బలంగా ఢీకొట్టారు. ఒకవేళ డ్రైవర్ ఆ సమయంలో కొండను ఢీకొట్టకపోతే, ఎదురుగా వస్తున్న కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ బడుగు రమేష్ వాహనాలను ఢీకొని ఉండేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
రక్షించండి అంటూ ఆర్తనాదాలు..
కొండను లారీ ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ కృష్ణ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. లారీ కొండలో కూరుకుపోవడంతో నన్ను రక్షించండి, ప్రాణాలు కాపాడండి.. అంటూ ఆయన ఆర్తనాదాలు చేశారు. పక్కనే ఉన్న సీఐ వెంటనే స్పందించి డ్రైవర్‌కు ధైర్యం చెప్పారు. ఏం కాదంటూ చాలాసేపు ఆయనతో మాట్లాడారు. వెంటనే జేసీబీని రప్పించి క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. రాజేంద్రపాలెం నుంచి వైద్యుడు జగదీష్‌నాయక్ వచ్చేసరికి డ్రైవర్ కృష్ణ మృతి చెందారు. కాగా, విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలోని వస్త్రపుర కాలనీ కొట్టువలసకు చెందిన క్లీనర్ షేక్ అసీర్‌ను వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


