అనకాపల్లి: పర్యావరణ పరిక్షణను కాపాడుతూ ఈ ఏడాది గణపతి నవరాత్ర ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతామణి గణపతి దత్త క్షేత్రం స్థలదాత సి.వి.రమారావు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని దేవి శ్రీదేవి ఎంటర్‌ప్రైజెస్ సహకారంతో సజీవ మొక్కలతో రూపొందించిన 20 అడుగుల ‘సస్య గణపతి’ బ్రోచర్‌ను, సస్య గణపతి నమూనాను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమారావు, దత్త క్షేత్రం నిర్వాహకులు ఆంజనేయరాజు విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సస్య గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, గణపతి తయారీకి 2 టన్నుల ఇనుమును ఉపయోగించడం జరిగిందని తెలిపారు. సుమారుగా 16 నుంచి 80 వేల మొక్కలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూపొందిస్తున్నామని, దీనికి రూ.50 లక్షల వరకూ ఖర్చు అవుతుందన్నారు. సస్య గణపతిని దత్త క్షేత్ర ఆవరణలో 21 రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచడం జరుగుతుందన్నారు. గణపతికి ఉపయోగించే మొక్కలను పూణే నుంచి దత్త క్షేత్రానికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 13న భక్తులకు (వినాయక చవితి పురస్కరించుకుని) ఉచితంగా 21 రకాల పత్రులు, గణపతి విగ్రహం, వ్రతకల్పం పుస్తకం అందజేస్తామని, దీనికి ముందుగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. దేవి శ్రీదేవి ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు సుధాకర్, విజయకుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14న ఒడిశా గవర్నర్ హరిబాబు విచ్చేస్తారని తెలిపారు. జలధారలు, ప్రకృతి సోయగాలు, దివ్యకాంతుల నడుమ వెలసిన సస్య హరిత గణపతిని దర్శించుకోవడం పర్యావరణ ప్రేమికులకు మంచి అనుభూతి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సన్యాసిరావు, టీడీపీ నాయకుడు నీలబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


