నిత్య సాధనతోనే గాయకులుగా రాణింపు | - | Sakshi
Sakshi News home page

నిత్య సాధనతోనే గాయకులుగా రాణింపు

Aug 20 2026 12:23 AM | Updated on Aug 20 2026 12:23 AM

సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ ముగిసిన శ్రీప్రకాష్‌ వ్యవస్థాపక వేడుకలు

పాయకరావుపేట: నిత్య సాధనతోనే భవిష్యత్‌లో మంచి గాయకులుగా ఎవరైనా రాణించగలరని ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ అన్నారు. శ్రీప్రకాష్‌ విద్యా సంస్థలు 49 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన 50వ వ్యవస్థాపక వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా రెండు రోజుల పాటు తుని, పాయకరావుపేట, అన్నవరం, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రపురం తదితర ప్రాంతాల శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్థల విద్యార్థుల మధ్య ‘గాతా రహే మేరా దిల్‌’పేరుతో పాటల పోటీలు నిర్వహించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు జూనియర్‌, సీనియర్‌ విభాగాలుగా ఈ పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ శైలజ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. నిరంతర సాధనతో విద్యార్థులు భవిష్యత్తులో మంచి గాయకులుగా ఎదగగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత సిహెచ్‌.వి.కె.నరసింహారావు మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం శైలజను జ్ఞాపికతో సత్కరించారు. పోటీల్లో విజేతలకు శైలజతో పాటు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌.విజయ్‌ ప్రకాష్‌ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు డా.నరేంద్రబాబు, కోశాధికారిణి సిహెచ్‌.రామసీత, సభ్యులు సబ్బవరపు సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement