దేవరాపల్లి: మండలంలోని వాలాబు పంచాయతీ శివారు కోడాపల్లికి ఎట్టకేలకు అధికారులు ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్‌ను మంజూరు చేశారు. నెల నెలా రేషన్ కష్టాలకు విముక్తి కల్పించాలని కోరుతూ ఇటీవల కోడాపల్లి, రామన్నపాలెం, పూలగరువు, ఇప్పగరువు, బుచ్చెంపాలెం గ్రామాల గిరిజనులు ప్లకార్డులు చేతపట్టి నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమ గ్రామాలలో ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియను నిలిపివేశారని ఆందోళనకు దిగారు. ఐదు గ్రామాల గిరిజనులు నాలుగు నుంచి ఆరు కిమీ మేర కాలిన నడకన వెళ్లి రోజంతా పనులు మానుకొని రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనతో అధికారులు దిగి వచ్చారు. శివారు ఐదు గ్రామాలకు కలిపి కోడాపల్లిలో రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తూ బుధవారం ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక గిరిజనులు మంజూరు పత్రాన్ని పట్టుకొని హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్టాక్ పాయింట్ ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్టు మంజూరు పత్రంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడం పట్ల స్థానిక గిరిజనులు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తామర్ల శంకరరావు, సిహెచ్‌బి.లక్ష్మి, సిహెచ్. లక్ష్మణ, సిహెచ్.చినదేముడు, కె.రామస్వామి, సిహెచ్.ఎరకయ్య మహిళలు పాల్గొన్నారు.


