రోలుగుంట: బుచ్చింపేట పీహెచ్‌సీ పరిధిలో గల లోసింగి గ్రామానికి చెందిన గర్భిణి పాంగి రాజేశ్వరి (24) తన ఇంటి వద్దనే మృతి చెందింది. ఈ సమాచారంతో బుధవారం డీఎంహెచ్‌వో ఆర్. అచ్యుతాకుమారి, డిప్యుటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ వచ్చి విచారణ చేపట్టారు. ఆరు నెలల గర్భవతి రాజేశ్వరి మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లినపుడు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో కుటుంబీకులు బుచ్చింపేట పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారి శివప్రసాద్ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా అసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే వారు ఆమెను గ్రామానికి తీసుకెళ్లారు. అవసరమైనవి సమకూర్చుకొని తిరిగి ఏరియా ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె గ్రామంలోనే మృతి చెందింది. దీనిపై సమాచారంతో డీఎంఅండ్‌హెచ్‌వో వచ్చి మృతురాలి కుటుంబీకులను ఓదార్చారు. జరిగిన విషయాలపై ఆరా తీశారు. గ్రామానికి ఆశా కార్యకర్త లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ రోడ్డు మార్గంలో కొండపై నుంచి దిగువకు పీహెచ్‌సీకి తీసుకురావడానికి ఎన్నో ఇక్కట్లు పడ్డామని తెలిపారు. కాగా ఈ సందర్భంగా బుచ్చింపేట పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో అచ్యుతాకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ బుధవారం విడివిడిగా అకస్మికంగా తనిఖీ చేశారు. డెలివరీలు ఎలా జరగుతున్నాయి..నెలకెన్ని జరుగుతున్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మాతృ మరణాలు జరగకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు జారీ చేశారు.


