స్థానిక ఎన్నికలకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు కసరత్తు

Aug 20 2026 12:23 AM | Updated on Aug 20 2026 12:23 AM

వీడియో కాన్ఫరెన్సులో సూచనలిచ్చిన కలెక్టర్‌ నిశాంతి

ఇప్పటినుంచి ఏర్పాట్లు చేయాలని ఆదేశం

పాడేరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో, అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచి కసరత్తు మొదలైంది. జిల్లా కలెక్టర్‌ స్థాయిలో అధికారులతో ఇప్పటికే సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు.. కలెక్టర్‌ టి. నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. అర్బన్‌ లోకల్‌ బాడీస్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత 15 రోజుల్లో పోలింగ్‌ నిర్వహించి, 18వ రోజున ఫలితాలు ప్రకటిస్తారని కలెక్టర్‌ వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ తర్వాత 16వ రోజున పోలింగ్‌ జరిపి, 19వ రోజున ఫలితాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన 14వ రోజున పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా షెడ్యూల్‌ ఉంటుందని వివరించారు.

ఏర్పాట్లు – ఓటర్ల వర్గీకరణ

పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామాగ్రి సిద్ధం చేయడం, కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓటర్ల వర్గీకరణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని 11 మండలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల ఓటర్లను విభజించి, కచ్చితమైన జాబితాలను సిద్ధం చేస్తున్నారు.

వెబ్‌సైట్‌ మాడ్యూల్‌ వినియోగం

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం, ప్రతి దశకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన అధికారిక వెబ్‌సైట్‌ మాడ్యూల్‌లో నిర్ణీత సమయంలోగా అప్‌లోడ్‌ చేయాలని అధికారులు ఆదేశించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్‌ నిశాంతి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ టి. నిశాంతి తెలిపారు. ప్రీ–పోలింగ్‌ ప్రక్రియ, ఓటర్ల విభజన, కౌంటింగ్‌ వంటి అంశాలపై ఎన్నికల సంఘం అందించిన సూచనలను అమలు చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎటువంటి లోపాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement