● 16 నెలలుగా ఏర్పాటుచేయనిఐటీడీఏ పాలకవర్గ సమావేశం
● తక్షణ నిర్వహించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్
అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వానికి పాడేరు ఏజెన్సీ ప్రాంత సమస్యలపై శ్రద్ధ లేదని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆరోపించారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించలేదని, తక్షణమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు బదిలీలపై వెళ్తున్నారు తప్ప, గిరిజనుల సమస్యలను పరిష్కరించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 11 మండలాల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల చెత్తాచెదారం నిండి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యాలు లేక నేటికీ డోలి మోతలు తప్పడం లేదన్నారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలు, సీసీ రోడ్డు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. గిరిజన ప్రాంత సమస్యలపై చర్చించేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెప్పాలని నిలదీశారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీల్లో నియమించిన ప్రత్యేక అధికారులు కనీసం గ్రామాల్లో పర్యటించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో అభిషేక్ స్పందించి ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు.


