● చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు
గూడెంకొత్తవీధి: విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు సూచించారు. జీవితంలో పైకి రావాలంటే విధిగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గూడెం ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందని, ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేందుకు సరైన ప్రణాళికను తయారు చేసుకుని దాని కోసం శ్రమించాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తుకు అలవాటు పడితే జీవితాలు నాశనమై, భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారిస్తే ఉజ్వల భవిషత్ ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికీ కూడా ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు. అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన ఆయన, మహిళలను ఎప్పుడూ గౌరవించాలని కోరారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్, ఎస్‌ఐ సురేష్, ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


