● ఏర్పాట్లపై సమీక్షించిన
జేసీ తిరుమణి శ్రీపూజ
పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న జిల్లాలో పర్యటించనున్నారని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఈనెల 22న అరకువేలీ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆయన సందర్శించి, సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి, ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతోనే ఈ సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు జేసీ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గన్నెల పీహెచ్‌సీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, సంబంధిత శాఖల అధికారులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.


