కొండకోనల్లో మార్మోగిన శివనామ స్మరణ
సీలేరు: హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ శివనామస్మరణతో కొండకోనలు మార్మోగాయి. ఒడిశా రాష్ట్రం గుప్తేశ్వరంలో కొలువైన మహాదేవుని భక్తులు కాలినడకన సోమవారం సీలేరు చేరుకుని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కావిళ్లతో నీరు మోసుకుంటూ, శివనామస్మరణ చేస్తూ వందల కిలోమీటర్లు కాలినడకన ఇక్కడికి చేరుకున్నారు. ఒడిశాలోని చిత్రకొండ తాలూకా ఐదు పంచాయతీలకు చెందిన సుమారు 120 మంది భక్తులు ఆషాఢమాసం ప్రారంభంలో శివమాలలు వేశారు. వీరు నెలరోజుల పాటు దీక్ష చేస్తారు. గురుపౌర్ణమికి మాలవేసి రాఖీపౌర్ణమి నాడు మాల తీస్తారు. దీనిని బోల్ భం దీక్ష అంటారు. శివమాలలు ధరించిన భక్తులు సోమవారం ఉదయం సీలేరుకు చేరుకుని, స్థానిక జలాశయంలో స్నానాలు ఆచరించి, శివాలయంలో అభిషేకం నిర్వహించారు. కాలినడకన వెళ్లి గుప్తేశ్వరంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి దీక్ష విరమిస్తామని గురుస్వామి తెలిపారు. సీలేరు వచ్చిన బోల్ భం దీక్షాపరులకు స్థానిక పెద్దలు స్వాగతం పలికారు.


