జి.మాడుగుల: మైదాన ప్రాంతాలకు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి, రెండు స్కూటర్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సాయిరాం పడాల్ శుక్రవారం అందించిన వివరాల ప్రకారం..తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 9 మంది కలిసి స్కూటర్లు, ఆటోపై 50 కిలోల ఎండు గంజాయిని తరలిస్తుండగా, పోలీసులు వారిలో 7 గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 50 కిలోల గంజాయి, రెండు స్కూటర్లు, ఒక ఆటో, 6 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల్లో రాష్ట్రానికి చెందిన 5 గురు, తమిళనాడుకు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిరాం పడాల్ తెలిపారు.


