కుళాయి వద్ద మంచినీటి కోసం అవస్థలు పడుతున్న గిరిజనులు
జి.మాడుగుల: మండల కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ కాలనీ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు తీవ్ర మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత పరిసరాల్లో 10 కుటుంబాలకు చెందిన సుమారు 40 మంది గిరిజన ప్రజలు జీవిస్తున్నారు. ఆ వీధిలో కేవలం ఒక్కటే నీటి కుళాయి ఉండటంతో, తాగునీటి కోసం స్థానికులు ఖాళీ బిందెలతో క్యూ కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజావసరాలకు తగినట్లుగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోనే ఇంతటి తీవ్ర నీటి సమస్య ఉంటే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికై నా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వీధిలో అదనపు మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు.


