మెట్టగుడలో విషాదం
పెదబయలు: మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యం సకాలంలో అందక గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. మండలంలోని రూడకోట పీహెచ్‌సీ పరిధిలోని గిన్నెలకోట పంచాయతీ, మెట్టగుడ గ్రామానికి చెందిన బురిడి మీనాక్షి (11) జ్వరంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందింది.
తల్లిదండ్రుల రోదన
మృతి చెందిన బాలిక మీనాక్షి, బొంగజంగి జీపీఎస్ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసి, 6వ తరగతిలో చేరాల్సి ఉంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాఠశాలల్లో జాయినింగ్ ప్రక్రియ ఆలస్యమైందని, ఇంతలోనే తమ కుమార్తె మృతి చెందడం దురదృష్టకరమని తల్లిదండ్రులు బలరాం, కళ్యాణి కన్నీరుమున్నీరయ్యారు.
గ్రామంలో జ్వరాల పంజా
మృతి చెందిన బాలిక సోదరీమణులు బురిడి సుమిత్ర (17), కోమలి (8) కూడా జ్వరంతో బాధపడుతున్నారు. మెట్టగుడ గ్రామంలో వంతాల రాంబాబు, వంతాల మోహన్‌రావు, వంతాల గణపతి, వంతాల మంగుతో పాటు మరో నలుగురు తీవ్ర జ్వరంతో ఉన్నారు. గత వారం రోజులుగా వైద్య సిబ్బంది ఎవరూ గ్రామానికి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని ఇతర గ్రామాల్లో కూడా జ్వరాలు అధికంగా ఉన్నాయని, వెంటనే అధికారులు చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
జ్వరంతో మృతి చెందిన బురిడి మీనాక్షి
జ్వరంతో బాధపడుతున్న బురడి కోమలి


