గూడెంకొత్తవీధి: బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు, 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ, ఈనెల 18న అసంపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్యపడాల్ ప్రకటించారు. ఆదివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి సభా స్థలిని పరిశీలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ బహిరంగ సభకు ముందు, ముల్లుమెట్ట నుంచి భారీ ర్యాలీని నిర్వహిస్తామని చిన్నయ్యపడాల్ తెలిపారు. ఈ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కొందరి ద్వారా కోర్టులలో కేసులు వేయించి, 1/70 చట్టాన్ని సవరించాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏకంగా 1,700 మంది సుప్రీంకోర్టులో కేసులు వేయడం గిరిజనులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. జీవో నంబర్ 3 రద్దుతో స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లోని ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా స్పందించి, బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడెంకొత్తవీధి మండల నాయకులు గడుతూరి సత్యనారాయణ, బాకై ్సట్ వ్యతిరేక కమిటీ జెర్రెల కన్వీనర్ కోరాబు బోడయ్య పడాల్ తదితరులు పాల్గొన్నారు.


