సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Jul 13 2026 12:46 AM | Updated on Jul 13 2026 12:46 AM

సీఐ శ్రీనివాసరావు

కొయ్యూరు: ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యతని కొయ్యూరు సీఐ బి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కొయ్యూరు సంతలో ఏర్పాటు చేసిన గిరిజనుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వాహనదారులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, ఇది ప్రమాద సమయాల్లో ప్రాణాలను కాపాడుతుందని వివరించారు. వాహనానికి సంబంధించిన బీమా సౌకర్యం, ఇతర పత్రాలను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేవైసీ అప్‌డేట్‌ చేస్తామని వచ్చే ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేశారు. క్యూఆర్‌ కోడ్లు, తెలియని లోన్‌ యాప్‌లను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దని కోరారు. ఒకవేళ స్పందిస్తే, మోసపోయి కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటారని హెచ్చరించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. మహిళలపై దాడులకు పాల్పడితే చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.గిరిజన యువత, ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సీఐ హితవు పలికారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement